తెలంగాణ విముక్తి కోసం జీవితాంతం పోరాడిన నల్ల నరసింహులు

తెలంగాణ విముక్తి కోసం జీవితాంతం పోరాడిన నల్ల నరసింహులు

“ఒక వీరుడు మరణిస్తే/వేల కొలది ప్రభావింతురు/ఒక నెత్తుటి చుక్కలోన/ ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు”

1945 నుండి 1951 వరకు నిజాం ప్రభుత్వ దన్నుతో రజాకార్లు, దేశములు, సర్ దేశ్ ముళ్లు, దేశాయి, సర్ దేశాయిలు, జమీన్ దార్లు, మత్తేదార్లు అమాయక లక్షలాది తెలంగాణా ప్రజలపై దశాబ్దాలుగా కొనసాగించిన రాక్షస, పైశాచిక అణచివేత, హత్యాకాండ, దోపిడికి వ్యతిరేకంగా, అప్పటిదాకా, ‘బాంచెను నీ కాళ్ళు మొక్కుతా దొర‘ అని బానిస బ్రతుకులనీడ్చిన లక్షలాది పేద రైతాంగ జనం తమ చేతులనే, శరీరాలనే ఆయుధాలుగా చేసుకొని జరిపిన ప్రపంచ ప్రసిద్ది చెందిన ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట‘ సందర్భంలో ప్రతి వ్యక్తి నినదించిన ప్రతిఘటనా నినాదం… చేసిన సింహ గర్జన, పోరు ఉరుము.. అప్పటి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోని 7430 గ్రామాల్లో ఆయన స్వంత ఖర్చుల కోసం ‘సర్ఫేఖాస్’ అని పిలువబడే భూమి ప్రభుత్వ దళారులైన పైన చెప్పిన ప్రైవేట్ దొరల ఆజమాయిషీలో నిజాం తరపున పన్నులు వసూలు చేసే అధికారాన్ని దఖల్ చేస్తూ పరిపాలించబడేది.

ఆ అప్రత్యక్ష అధికారాన్ని చేజిక్కించుకొని కొందరు భూస్వాములు లక్షల, వేల కొద్ది ఎకరాల భూమిని తమ ఆజమాయిషీలో పెట్టుకుంటే, ఆ భూములను సాగుచేసి పంటలను పండించే రైతులు మాత్రం ఒట్టి కౌలుదార్లే, కూలీలై, దొరల గడీల్లో వెట్టి బానిసలై బతుకులనీడుస్తున్న నిస్సహాయ దయనీయ కాలంలో ఉదా: మానుకోటకు చెందిన జన్నారెడ్డి ప్రతాపరెడ్డి కుటుంబం ఒక లక్షా యాభై వేల ఎకరాల భూమిని, విసునూరు దేశ్ ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి అరవై గ్రామాలను ఆవరించిన నలభై ఎకరాల భూమి, సూర్యాపేట దేశ్ ముఖ్ కు ఇరవై వేల ఎకరాల భూమి, ఇలా దున్నే వాళ్ళు లక్షలాది దిక్కుమొక్కు లేని లక్షలాది పేద జనమైతే వాళ్ల మీద, ఆ వ్యవసాయ ఫలాన్ని అనుభవిస్తూ సర్వాధికారాలను కలిగి తరతరాలుగా ప్రజలను హింసిస్తూ దోపిడీ చేస్తున్న పదుల సంఖ్యలో భూస్వాములు ఒక అసమానసమాజంగా కునారిల్లుతున్న 1945 దశకంలో పెను ఉప్పెనై పోటెత్తిన తెలంగాణ సాయుధ విముక్తి పోరాట కెరటాల్లో ఒక మహోత్తుంగా తరంగమై విప్లవించినాడు శ్రీ నల్లా నరసింహులు. జనగామ ప్రాంత దళ నాయకుడు.

పెత్తనం దార్ల పై జీవితాంతం పోరాడిన నల్ల నరసింహులు

చారిత్రాత్మక ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి‘ నాయకత్వం వహించిన ‘ఆంధ్ర మహాసభలో అత్యంత కీలక పాత్ర వహించి వేలాది మంది యోధులతో నిజాం ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ | వీరోచిత విముక్తి పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నోసార్లు పోలీసులకు పట్టుబడి, చిత్ర హింసలకు గురై, కోర్ట్ కేసునెదుర్కొని, మూడుసార్లు ఉరిశిక్షలు విధించబడి, కోర్ట్ లో అత్యంత ధైర్యంగా తన వాదనలను వినిపించి న్యాయస్థానాల చేతనే “తెలంగాణ  టైగర్” అని కీర్తించబడ్డ సామాన్యుడే అయిన అసామాన్య వీరకిశోరం నల్ల నరసింహులు.

రజాకార్ల కదంబ హస్తాల నుండి విముక్తికోసం జీవితాంతం పోరాడిన నల్ల నరసింహులు

90 సం||రాల సుదీర్ఘ భారత స్వాతంత్ర్య పోరాటం తర్వాత 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ పాలకుల నుండి ఇండియా స్వేచ్ఛా స్వతంత్రాలను పొందితే నిజాం దుష్ట పాలనలో మగ్గిపోతూ స్థానిక భూస్వాముల, రజాకార్ల కదంబ హస్తాల నుండి విముక్తికోసం తమ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూ తన సహా భారత పౌరులతో పాటు స్వాతంత్ర్యాన్ని పొందలేక తాను మాత్రం నిజాం హైదరాబాద్ పోలీస్ యాక్షన్ తర్వాతే, నిజాం భారత యూనియన్ ప్రభుత్వానికి లొంగిపోయిన అనంతరమే సెప్టెంబర్ 17, 1948న భారతదేశంలో విలీనమైన తెలంగాణ నిజమైన 2వ స్వాతంత్ర్యాన్ని పొందింది. ఇది తెలంగాణకు సంబంధించి ఒక విచిత్రమైన ప్రత్యేక ఘటన. ఈ రెండు చిత్రమైన సందర్భాలలో మధ్య కాలంలో జరిగిన వేలాది మంది మరణాలకు, ఊచకోతలకు, మానభంగాలకు, హత్యలకు పైశాచిక హింసకు సాక్షమై నిలిచిన సంధి సమయాన్ని చారిత్రాత్మక 10 లక్షల ఎకరాల భూ విముక్తి తర్వాత దాన్ని పేదలకు పంచిన ప్రజా విజయ ఘటనకు నడుమ గగనమెత్తు పోరు ప్రతీకై నిలిచిన వాడు నల్ల నరసింహులు.

Read More  ఆర్యభట్ట జీవిత చరిత్ర, Biography of Aryabhatta

నల్ల నరసింహులు గ్రామం కడవెండి. అతి మామూలు పేద పద్మశాలి కటుంబం. చేనేత పని చేసి ఉర్దూ మీడియంలో ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నవాడు  నల్ల నరసింహులు. దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఏండ్లకు ఏండ్లు అజ్ఞాతంలో ఉంటూ విప్లవించిన సాయుధ యోధుణ్ణి చేసి చరిత్రలో నిలిచిపోయే వీరునిగా రూపొందించాయి అప్పటి పరిస్థితులు.

రజాకారు గుండాలకు ఎదురొడ్డి పోరాటం చేసిన విప్లవకారుడు పద్మశాలి ముద్దుబిడ్డ నల్ల నరసింహులు

పరిస్థితులేమిటంటే గ్రామాలన్నింటిలోనూ ప్రజలకు భూములు లేవు. అన్ని దొరల భూములే. దాదాపు కౌలు రైతులే. ఏ ఒక్కరిద్దరికో కొద్ది భూమి ఉన్నా దొర మనుషులు ఏదో రకంగా ఆ భూమిని జప్తు చేసుకునే ప్రయత్నాలే నిరంతరం. ప్రజలను కులాలు కులాలుగా, మతాలు మతాలుగా విభజించి, పోలీసుల సహకారంతో, రజాకార్ గూండాలతో, తామే స్వయంగా పోషించే మనుషులతో.. దాడులు జరుపుతున్న స్థితిలో అస్సలే ఐకమత్యం లేని జనం. జనాన్ని కూడగట్టి గడ్డిని తాడులా పేనగల నాయకత్వ లేమి. ఇవి మనిషిని ప్రతిరోజు చంపుతూ బ్రతికే శవంగా మార్చేది భయం. భయంతో తెలంగాణ అంతా వందలకొద్ది గడీల కింద నలిగిపోతూ ప్రజలు కాలగర్భంలో కలిసిపోతున్న భీభత్స సందర్భంలో ‘ఆంధ్రమహాసభ‘ రూపంలో ప్రవేశించిన కమ్యూనిస్ట్ల ఆగమనం ఒక కొత్త వసంతాన్ని తెచ్చింది. తెలంగాణ నేలపైకి పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, నైతిక విలువలతో, మానవీయ ప్రవర్తనా పరిమళంతో తమకున్న ఆస్తులను ప్రజలపరం చేసి, తమ భార్యా పిల్లలతో, కుటుంబ సభ్యులతో సమా ప్రజా రంగంలోకి దూకి దిక్కుమొక్కు లేని జనానికి మేమున్నాం, మీ
కోసం మేమున్నాం అని ప్రతి గ్రామీణున్నీ | సంఘటిత పరుస్తూ, భువనగిరిలో జరిగిన 11వ ‘ఆంధ్ర మహాసభ’ ద్వారా గ్రామ దళ నిర్మాణంతో రంగంలోకి దూకిన నల్లా నరసింహులు అగ్గి అంటుకున్న అరణ్యాన్ని ఆర్పడం  అంత సుళువు కాదు. జనగామ తాలూకాలోని ఎన్నో గ్రామాల్లో ‘సంగం’ దళాలను నిర్మించి, స్వయంగా నాయకత్వం వహించి పార్టీ అగ్ర నాయకుల సమన్వయంతో విప్లవించిన కొదమ సింహం నల్ల నరసింహులు. ఆయన తన పార్టీ విధేయునిగా అట్టడుగు కార్యకర్తలను సంఘటిత పరుస్తూ, చైతన్య పరుస్తూ, అటు అగ్ర నాయకత్వంతో పార్టీ బలోపేతానికి పాటుపడూ దొరలకూ, రజాకార్లకూ సింహ స్వప్నమై నిద్రలేకుండా చేశాడు.
మొట్టమొదటి తి గుబాటు తన స్వంత ఊరు కడివెండి నుండే మొదలు పెట్టి 1947 సెప్టెంబర్ 11న నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దోపిడీ దారులైన భూస్వాములను తరిమికొట్టేందుకు ‘సాయుధ పోరాటా’నికి పిలుపు ఇవ్వబడింది.

Read More  సింప్లిలెర్న్‌ వ్యవస్థాపకుడు కృష్ణ కుమార్ సక్సెస్ స్టోరీ

దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన నల్ల నరసింహులు

ఇక అక్కడినుండి నిప్పుల కొలిమైన తెలంగాణ నేల నాలుగు చెరగులా ప్రత్యేకించి భూస్వామ్య వ్యవస్థ బలంగా పాతుకుపోయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఎర్రజెండాల నీడలో లక్షలాది మంది నిరక్షరాస్య సుశిక్షిత ప్రజాసైన్యం ఎక్కడిక్కడ దొరల గడీలపై, ఖాసిం రజ్వీ నాయకత్వంలో పని చేసే రకార్ల, నిజాం పోలీస్ క్యాంప్ పై మెరుపు దాడులు చేస్తూ ప్రతీకార జ్వాలల్లో తరతరాలుగా బందీ అయిపోయిన ప్రజల అప్పు పత్రాలను నిలబెడూ, గడీలను ధ్వంసిస్తూ, దొరలను ప్రజా కోర్టుల్లో నిలబెట్టి శిక్షిస్తూ, వేలకొద్ది ఎకరాల భూములను విముక్తం చేస్తూ, బహిరంగంగానే ‘దున్నే వాడికే భూమి’ని పంచిపెడ్తూ, ఆ క్రమంలో వందలు వేలమంది కర్కశ నిజాం సైన్యాలకు, రజాకార్లకూ బలై ప్రాణాలను కోల్పోతూ 1951 వకు అంతటా ఒక భీభత్స యుద్ధకాండ. అప్పుడే సంభవించిన ఘటనలు బందడీ వీరోచిత ప్రటిఘటన.

ఆకునూరు మాచిరెడ్డి తిరుగుబాట్లు, తిమ్మాపురం, అల్లీపురంచ, బక్కవంతులగూడెం, మేళ్ళచెరవు, ఊచకోతలు, జెండా పండుగ నాడు పర్కాలలో భయంకర సామూహిక హత్య తర్వాత బైరాన్‌పల్లిలో వందల మందిని చెట్లకు కట్టేసి, స్త్రీలను నగ్నగా బతుకమ్మ ఆట ఆడించి అమానుషంగా చెరిచి 118 మందిని కాల్చి చంపడాలు, ఉద్యమం హైదరాబాద్ నగరానికి వ్యాపించి అనేక డెన్లు, కమ్యూనిస్టు కమ్యూన్స్ ఏర్పాటు, అజ్ఞాత దళాల రహాస్య కదళికలతో హింసా, ప్రతి హింసలతో తెలంగాణ అగ్ని గుండమై ప్రజ్వరిల్లడాలు.

122 దళాలలను, ఆత్మార్పణ గెరిల్లా సమూహాలనూ నిర్మించి, నాయకత్వం వహించి, కదనరంగంలో ముందుండి నడిపించి అనేకసార్లు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి, అప్పుడప్పుడు పట్టుబడి ఘోరాతిఘోరమైన హింసను సహించి, అనేక కేసుల్లో ఇరికించబడి, మూడుసార్లు ఉరిశిక్షలు విధించబడి అజేయంగా నిలిచిన నల్లా నరసింహులును ఒకసారి పోలీస్ చర్య అనంతరం యూనియన్ సైన్యాలు నిషిద్ధ కమ్యూనిస్ట్ సభ్యులను అడవుల్లోకి తరుముతూ వందలమందిని హత్య చేస్తున్నపుడు, అప్పటికి సికింద్రాబాద్ జైల్లో 12 మందిలో ఒకడిగా ఇక రూపు ఉరి తీయబడ్డాడనగా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థల, భారత ట్రేడ్ యూనియన్ల ఆందోళన ఫలితంగా ఉ రితీతకు 12 గంటల ముందు ఉరిశిక్ష నిలిపివేయబడి అసలు ఈ నల్లా నరసింహులు ఎవడు? అని అప్పటి యూనియన్ సైనిక జనరల్ జె.ఎన్. చౌదరి నల్లగొండ జైలుకు చూడ్డానికి వచ్చినపుడు ఆ జిల్లా ఎస్.పి. ధనరాజ్ నాయుడు సంకెళ్ళతో ఉన్న నల్ల నరసింహులును “టైగర్ ఆఫ్ తెలంగాణ” అని పరిచయం చేశాడు. నిరంతరం గర్జిస్తూ ఉరిమే పులి నరసింహులు.

అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా విముక్తి పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు నెహ్రూ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారని స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు నివేదికలవల్ల నిషేదానికి గురై, లక్షలాది కరపత్రాలను హెలికాప్టర్ ద్వారా అజ్ఞాత నాయకులనూ, క్యాడరూ లొంగిపోవాల్సిందిగా హెచ్చరించిన నేపథ్యంలో నల్ల నరసింహులు వంటి అనేకమంది యోధులు నల్లమల అడవుల్లోకి, రాచకొండ అరణ్యాల్లోకి నిష్క్రమించి, మళ్ళీ ప్రతిఘటన. చివరికి విచిత్రమైన పరిస్థితుల్లో
1951 అక్టోబర్ ‘సాయుధ పోరాటాన్ని‘ విరమిస్తున్నట్టుగా జాతీయ కార్యదర్శి కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటన ఒకటి వెలువడి అఖండాగ్ని చప్పున చల్లారిపోయింది.

Read More  సోమనాథ్ ఛటర్జీ జీవిత చరిత్ర,Biography of Somnath Chatterjee

భారతదేశంలో పరిపాలన ప్రారంభమైన తర్వాత కూడా తనపై ఉన్న అనేక కేసులతో సమమతమై కోర్టర్ల చుట్టూ తిరిగి తిరిగి చివరికి అప్పటి శాసన సభ ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య చొరవతో చివరి ఉరిశిక్ష నుండి బయటపడి, అంతిమంగా 1959 జనవరి 26న స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చాడు నల్ల నరసింహులు. తర్వాత బొంబాయి,షోలాపూర్‌లో పార్టీ క్యాడర్ వేలమందితో ఘనంగా ఆదరించబడ్డా చివరికి శేష జీవితమంతా మిగిలిని వీరోచిత అనంతమైన రక్తసిక పోరాట స్మృతులతో తానూ తన ధర్మపత్ని వజ్రమ్మ చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం అసువులు బాసిన 4000 మంది వీరులనూ, పిడిత ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమి పంపక విజయాలను స్మరించుకుంటూ ‘జీవితమే ఒక నిరంతర పోరాటం’ అన్న తృప్తితో మిగిలిపోయారు. నల్ల నరసింహులు 1993 నవంబర్ 5న అనంతవాయువుల్లో లీనమై, కడివెండి ప్రజలకు ‘జీవితమంతా తను నమ్మిన సిద్ధాంతం కోసమే బతికిన మహా వీరునిగా’ ఒక పోరాట వారసత్వమై శాశ్వత సజీవుడయ్యాడు. వీరునికెన్నడూ మరణం లేదు. అతడు ఎప్పుడూ ప్రజల గుండెల్లో నిరంతర స్ఫూర్తితో ప్రజ్వలిస్తూనే ఉంటాడు.

భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం పోరాడిన నల్ల నరసింహులు చరిత్ర 

జనగామ ప్రజలచేత విప్లవసింహంగా పిలుచుకోబడ్డాడు. నవంబర్ 5, 1993న మరణించే వరకు సకల జనులకు మద్దతుగా ప్రజా ఉద్యమాలకు అండగా నిల్చాడు. మిత్రులారా కా|| నల్ల నరసింహులు లాంటి స్వాతంత్ర్య పోరాట యోధుల శ్రమ ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా స్వతంత్రంతో ఉన్నామని నేటి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకత్వంలో ఇక్కడి ప్రజలు జరిపిన అశేష పోరాటాలు, త్యాగాలతో జనగామ జిల్లా ప్రపంచపటంలో మానవ ఇతిహాంలో ప్రముఖమైన స్థానం పొందింది. మన ఉన్నతికి కారణమైన అమరవీరులను స్మరించుకుందాం.

నల్ల నరసింహులు జయంతి 2 అక్టోబర్ 1926

నల్ల నరసింహులువర్గంతి 5 నవంబర్ 1993

మన జాతి ఆణిముత్యాన్ని సగర్వంగా ఎలుగెత్తి చాటుదాం రండీ! నల్ల నరసింహులు స్మారక సమితి – తెలంగాణ.

కన్వీనర్ : దాసరి జనార్దన్
సీనియర్ పాత్రికేయులు Cell: 9394117771, 9390110777. ఇ.నెం. 11-21-86, కాశిబుగ్గ, వరంగల్ – 506002. (తెలంగాణ).

Sharing Is Caring: